skip to main | skip to sidebar

స్వీయాప్రియం

Pages

  • Home

Thursday, November 17, 2011

యా అల్లా....!!

పాతబస్తీ లోని ముస్లిం యువతుల జీవితాలపై   పేదరికం, కుటుంబంలో అధిక సంతానం , మతం వంటివి చేస్తున్న దౌర్జన్యాలకు స్పందిస్తూ....
 
 
 

అక్కడ పరదాల మాటున ఫత్వాలు ఎరుగని నీడలు కదలాడుతూ ఉంటాయి...!
హిజాబుల ముసుగులో హిసాబ్ తేలని ప్రశ్నలు వేళ్ళాడుతూ కనిపిస్తాయి...!
వెలుగు రేఖలకైనా చోటులేని ఇరుకు ఆవాసాలలో
చీకటి రంగుతో సహవాసాలు చేస్తున్న చూపులు,
ముజాహాబ్లు అంటుకుని మసిబారిపోయిన గోడల మధ్యన
ముడుచుకుపోయి, నలగిపోయిన మనసులు ఎదురవుతాయి...!
రెక్కలు కత్తిరించి పంజరంలో పడవేయబడ్డ పక్షులు
ఊచల కమ్మీలలోంచి చూస్తుంటాయి...!
ఆంక్షలు , ఆంక్షలు.... ఎటు చూసినా అడ్డుగోడలు ...
షబాబ్ శాపం ఒంటికి చుట్టుకుంటుంది...
గరీబ్ భూతం వెంటాడుతుంది...
అరబ్ అత్తరు ఒలికి బ్రతుకు బుగ్గవుతుంది ...!!




ఫత్వా= పరిష్కారం
హిజాబ్ = బురఖా
హిసాబ్= లెక్క
ముజాహాబ్ = మతం
షబాబ్= యవ్వనం
Posted by స్వీయాప్రియం at 10:40 PM 1 comments
Labels: priya, Sweeya

Monday, September 12, 2011

రాధావల్లభుని రాకకై....

 -స్వీయ

స్మర్యంత్ర సింధూరం నుదుటిన దిద్ది 

హరిమోహన హారాలతో అలంకరించుకుని

కన్దర్పకుహలీ వనాన కోకిల గానం చేస్తుండగా

వెన్నెల వీధిలో వెండంచు మబ్బులు విహరిస్తుండగా

సంపెంగ సువాసనల సమీరాలు వీస్తుండగా

రాగిణీ పుష్పాల మాల కడుతూ
రాధారాణి నీ రాకకై ఎదురుచూస్తుంది...



మదనమోహన మురళీగానం మదిని తాకిన

మైమరచి ఆడే మయూరాలు నీ రాకని తేలపకనే తెలుపుతున్నాయి 

హంసగంజన సవ్వడులు కలఝంకారాలతో కలసి

నీ అల్లన మెల్లని అడుగుల సడిని వినిపిస్తున్నాయి 

నీవు రాగానే నీ హృదయమోదన స్థానంలో తలవాల్చి
కనులుమూసి కలవరించి

తనువు మరిచి పులకరించి

తనలోని ప్రేమనంతా నీకు అర్పించాలని

గోవింద ప్రణయధార హృదయం ఎగసి పడుతున్నది...
-ప్రియ
Posted by స్వీయాప్రియం at 7:06 AM 1 comments
Labels: priya, Sweeya

Saturday, September 10, 2011

నిరీక్షణ...



~ స్వీయ

పూరేకులు పరిచిన  హృదయమార్గంలో సుతిమెత్తని అడుగై నడిచి వస్తావని 
నిరీక్షణ... 
కలువ మొగ్గల కన్నులలో పండు వెన్నెలై కురుసి వరిస్తావని  
నిరీక్షణ...
మౌనరాగాల మదిలో కోటి స్వరాల విపంచివై వినిపిస్తావని 
నిరీక్షణ...
విరజాజి రేకు సొగసుకు సుర సౌరభాల శోభనిస్తావని 
నిరీక్షణ...
సంద్రమైన కన్నులలో స్వాతి ముత్యమై మెరుస్తావని 
నిరీక్షణ...
కలవరింతల కాలంలో కౌగిలింతల వరమిస్తావని
నిరీక్షణ...
~ ప్రియ
Posted by స్వీయాప్రియం at 8:26 PM 1 comments
Labels: priya, Sweeya

Wednesday, August 31, 2011

నీ ప్రేమలో...




ఎగిరొచ్చే సీతకోకచిలుకలంటి నీ జ్ఞాపకాలు
నా చుట్టూ అల్లరిగా తిరిగి గిలిగింతలు పెడుతున్నాయి . .
పలకరించే పిల్లగాలి తెమ్మెరంటి నీ ఊహలు
నా పైట లాగి కొంటెగా నవ్వుతున్నాయి . .
కవ్వించే కొండగాలి వంటి నీ ఊసులు
నన్ను మత్తులో ముంచి మురిపిస్తున్నాయి . .
తీయని వేణుగానమంటి నీ పలుకులు
నా వయస్సును తట్టి లేపుతున్నాయి . .
మెరిసేటి ముత్యమంటి  నీ నవ్వులు
నా కంటిపాపకు పండుగలను తెస్తున్నాయి . .
ఆకాశం సరితూగాలేని అసమానమైన నీ హృదయం
నా మదిలో ప్రేమ రాగాలను పలికిస్తున్నది . . !

Posted by స్వీయాప్రియం at 4:09 AM 0 comments
Labels: priya, Sweeya

Wednesday, August 24, 2011

రంగుల వలయంలో గాజు హృదయం ! !


~ స్వీయ 


నేల పైనే నింగి సాక్షాత్కరిస్తుంది
నింగి అంచులలో నడచినట్టు తోస్తుంది
నవ్వు కూడా నదివెల్లువైపోతుంది
ఊహలన్నీ పాలపిట్టలై పరుగులు తీస్తాయి
పలుకులన్ని పారిజాతాలల్లె పరిమళిస్తాయి
 రంగులు రంగులు
ఎటు చూసినా రంగులు
కనులకంతా విందులు 
ఉదయపు తొలికిరణం మొదలు
రేయి మలిఘడియ వరకూ అంతా ఆనందం
ఏదో తెలీయని తారంగం
వేసవిలోనైనా చలిమంట వేసే వెర్రి వయసుతో కూడి
మతిలేని మనసు చేసే వీరంగం
అంతా కోలాహలం
అర్ధంకాని గందరగోళం
అందమైన రెండక్షరాల పదం ఆడే ప్రళయ తాండవం
ఆ ప్రళయ కాల అలలు చుట్టుముట్టి
ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరిని లాగి మింగేసినప్పుడు
నాడులన్ని స్థంబించి
బీటలువారిన గాజు హృదయం ముక్కలుగా పగిలినప్పుడు
ఆ ముక్కలనే రెక్కలుగా చేసి పైకెగరగలిగితే
ఆత్మవిశ్వాసమే ఆయువై
ఆత్మాభిమానమే ధైర్యమై
సాగే ఆ పయనానికి ఆకాశమే హద్దు . . !

~ ప్రియ 
Posted by స్వీయాప్రియం at 11:50 PM 0 comments
Labels: priya, Sweeya

Tuesday, May 3, 2011

మనఃస్థితి

~ స్వీయ 


ఎదుటివాడి బాధ మన సంతోషానికి కారణం అవుతోంది . . !

లేదా
వాడి సంతోషం మన బాధకు కారణం అవుతోంది . . ! !
ఏంటీ పరిస్థితి !
దీన్ని మార్చలేమా ? ?
కాదు కాదు, మారాల్సింది పరిస్థితి కాదు . .
మన మనఃస్థితి..!!

మన బాధ మనకి బాధే అయినప్పుడు,
ఎదుటివాడి వాడి బాధ కూడా మనకు బాధే అవ్వాలి.
మన సంతోషం మనకు సంతోషం అయినప్పుడు,
ఎదుటివాడి సంతోషం మనకు సంబరమవ్వాలి . .

ఆలోచిస్తే చాలా చిన్న విషయం . .
ఆచరిస్తే చాలా గొప్ప విషయం . . .

ఒక్కసారి ఆలోచిద్దాం ! ఆచరిద్దాం ! !
మార్పు ఎలా రాదో చూద్దాం ! ! !
~ ప్రియ 
Posted by స్వీయాప్రియం at 10:48 AM 2 comments
Labels: priya, Sweeya

Wednesday, April 20, 2011

అరవింద



నయనాల నింగిలో నల్లటి జాబిల్లి జారవిడిచిన

నీలాల వెన్నెల జల్లులో తడిసిన
అరవింద కుసుమ సుకుమారమా...
నీ అందమంతా ప్రకృతై విరబూస్తున్న వేళ
ఆమనికై ఎదురుచూపేల...

కలవరింతలోని పులకరింతవంటి 
సుగంధ పరిమళాల మనోభావమా...
మనసంతా నీవైన వేళ మరొకరికై ఆరాటమేల...

Posted by స్వీయాప్రియం at 7:35 AM 0 comments
Labels: priya, Sweeya

Tuesday, March 15, 2011

నీలవేణి






ఎర్ర బొట్టు నీలవేణి...
పచ్చ చీర నీలవేణి...
నీలి కళ్ళు నీలవేణి...
ఎదురుచూపు నీలవేణి...




Posted by స్వీయాప్రియం at 11:45 AM 0 comments
Labels: priya, Sweeya
Newer Posts » Home
Subscribe to: Comments (Atom)

About Us

  • S
  • కవితాంజలి...
  • స్వీయాప్రియం

About this blog

అనగనగా ఒక ఉహాలోకంలో ఒక బొమ్మ.

నిశ్చల, నిర్మల బొమ్మ.

కోటి భావాలను మనసులో దాచుకుని మౌనంగా చూసే బొమ్మ.

అదే లోకంలో ఒక కవిత.

అలల సవ్వడి లాంటి కవిత.

కిలకిలరావాల కవిత.

కొటానుకోటి భావాలను అక్షరాల వర్షంలో తడిపే కవిత.

ఒకనాడు ఈ కవిత ఆ బొమ్మను చూసింది.

బొమ్మ మనసులోని భావాలను దాని కళ్ళలో చదివింది.

ఆనాటి నుంచి బొమ్మ మాట్లాడుతోంది...

కవిత ద్వారా మాట్లాడుతోంది....

ఇది రెండు కళాహృదయాల కథ..

ఒక విడిపోని, విడదీయలేని స్నేహం కథ...

మనసులోని భావాలకి ఒకరు రూపమిస్తే, ఒకరం ప్రాణం పోస్తాం..

ఇది రెండు అందమైన మనసుల లోకం..

"గీత-రాత " ల లోకం.

చక్కని బొమ్మల, కమ్మని మాటల లోకం..

ఈ లోకానికి శ్రీకారం చుట్టింది... మా స్నేహం..!

Labels

  • priya (14)
  • Sweeya (14)

Blog Archive

  • ►  2012 (6)
    • ►  June (5)
    • ►  January (1)
  • ▼  2011 (8)
    • ▼  November (1)
      • యా అల్లా....!!
    • ►  September (2)
      • రాధావల్లభుని రాకకై....
      • నిరీక్షణ...
    • ►  August (2)
      • నీ ప్రేమలో...
      • రంగుల వలయంలో గాజు హృదయం ! !
    • ►  May (1)
      • మనఃస్థితి
    • ►  April (1)
      • అరవింద
    • ►  March (1)
      • నీలవేణి

Followers

Follow this blog
http://sweeyapriyam.blogspot.com/. Powered by Blogger.
.
 
Copyright © స్వీయాప్రియం. All rights reserved.
Blogger templates created by Templates Block
Wordpress theme by Uno Design Studio