skip to main | skip to sidebar

స్వీయాప్రియం

Pages

  • Home

Saturday, June 23, 2012

నైశిక

 -స్వీయ
లోకమంతా నిదురిస్తోంది..
నేను తప్ప!
తెల్లవార వస్తోంది..
నాకు తప్ప!!
ఎంత వెతికినా నిద్దుర దరిదాపుల్లో కానరావటమే లేదు..
చీకటనేమో!!!
మరి వెలుతురేది? ఎక్కడుంటుందది??
అసలిది రాత్రేనా??
రాత్రయితే నిద్రేది?
నిద్రపోని జాతులు కొన్నున్నాయట..
వాటిలో నాదే జాతో!!
నిశాచరినా?
ఒక్క అడుగైనా కదపలేకున్నానే!
పిశాచాన్నా?
బరువెక్కిన ఊపిరి కాదంటోందే!
దివాభీతినా?
కన్ను పొడుచుకున్నా చూడలేకున్నానే!
గబ్బిలాన్నా?
ధ్వని తరంగాలు గుండెలోనే సుడులుతిరుగుతున్నాయే!
శూన్యగత్తెనా?
ఆ మంత్రమేదో మనసుకే వేసుకుందునే!
చందమామనా?
పున్నమంటూ ఎరుగనే!
బ్రహ్మ కమలాన్నా?
ఎన్నో వసంతాలుగా విరబూయనే లేదే!
మరి నేనెవరిని?
నా పగలు రాత్రుల మధ్యన
సన్నటి పొరైనా లేదేమిటి?
నిద్రపోనా? నిద్ర రాదా??
నిద్రిస్తూనే ఉన్నానా???
అసలు నేనే నిద్రనా????
-ప్రియ
Posted by కవితాంజలి... at 12:32 PM 1 comments
Labels: priya, Sweeya

Friday, June 22, 2012

తత్వాన్వేషణ



-స్వీయ

ఓ “బుద్ధుడా”!
తరాలుగా నీలో వేళ్ళూనుకున్న
చెత్త తత్వాలన్నీ పెకిలించుకు పరిగెట్టు..
అది బోది వృక్షం కాదు!
నువ్వు చేస్తున్నది తపస్సూ కాదు!!
పచ్చి వాసన మరచిపోయి, దారు కణజాలం ఆవిరైపోయి
ఎండుచెక్కలై పోతున్నకొమ్మలకి
లేత చిగురాకు ఈకల రెక్కలు తొడుగు...
చెదపురుగులు తినివేసి, శిధిలావస్థకు చేరి,
మోడుబారిపోయే లోపు లే... లేచి పరిగెట్టు!
తత్వమదే బోధపడుతుంది....!!


-ప్రియ




Posted by స్వీయాప్రియం at 11:31 AM 0 comments
Labels: priya, Sweeya

పునర్జన్మకెన్ని పురిటినొప్పులో!!!

 
-స్వీయ

నా తల్లి పురుటినొప్పులు పడుతోంది...
నన్ను మరలా కనేందుకు!
నా తల్లి తల్లడిల్లుతోంది...
నాకు పునర్జన్మనిచ్చేందుకు!
నా తల్లి నరాలు తెంపుకుంటోంది...
నా దారి సుగమనం చేసేందుకు!
నా తల్లి తన జగద్యోని తమస్సుని చింపుకుంటోంది...
నన్ను వెలుగురేఖల పొత్తిగుడ్డలలో చుట్టి, చూసి మురిసిపోయేందుకు!!

-ప్రియ

Posted by స్వీయాప్రియం at 11:00 AM 1 comments
Labels: priya, Sweeya

మబ్బు

 

- స్వీయ

అది మబ్బు... మది మబ్బు..
కమ్మేసి, కుదిపేసి, కురిసేసి, ముంచేసే మబ్బు...
వాన వెలుస్తుంది...
మది చల్లబడుతుంది...
మబ్బు తొలగుతుంది...
మనసు తేలికవుతుంది...

 -ప్రియ


Posted by స్వీయాప్రియం at 10:41 AM 0 comments
Labels: priya, Sweeya

మౌనం...

-స్వీయ

మౌనం...
మనలో మనమై, మమేకమై,
అవలోకనమై, ఆలోచనై,
అంతర్జాలమై, ఆత్మ దర్శనమై,
మనకే మనము అంతా అవగతమైపోయే
మాధ్యమం...
 -ప్రియ


Posted by స్వీయాప్రియం at 10:34 AM 0 comments
Labels: priya, Sweeya

Saturday, January 28, 2012

దేహాత్మైక్యం



దేహపు పొరల్లో, ఆత్మకు అతి చేరువలో నిఘూడమై ఉన్న
కాంక్షను నిద్దురలేపి, ఊపిరినూది, అణువణువునా ప్రవహింపజేసి,
తను నా రక్తకణాలని ఉత్తేజపరిచిన క్షణం.....
నేను నా రహస్యాలను ఒక్కొక్కటిగా తనకు అప్పజెప్పేసి,
తన తనుమనః ఆలంబనలో లీనమై... లయమైపోతాను...!
ఆ ఆలింగన ముడిలో చిక్కుపడిన శ్వాసలను
మరింతగా పెనవేసుకుని.....
మోహపు రూపమై, విరహపు వారధులు దాటి
స్పర్శలు రగిల్చిన వేడిలో కరిగి....
ఘనీభవించిన హిమాలయపు అంతర్భాగమున
జనియించి, అధోభాగమున ప్రవహించు
మానస సరోవరములో మునకలేసి....
ముక్తాత్మనై, మోక్షసిద్ధినై తరిస్తాను..!!


Posted by కవితాంజలి... at 6:06 AM 2 comments
Labels: priya, Sweeya
Newer Posts » « Older Posts Home
Subscribe to: Comments (Atom)

About Us

  • S
  • కవితాంజలి...
  • స్వీయాప్రియం

About this blog

అనగనగా ఒక ఉహాలోకంలో ఒక బొమ్మ.

నిశ్చల, నిర్మల బొమ్మ.

కోటి భావాలను మనసులో దాచుకుని మౌనంగా చూసే బొమ్మ.

అదే లోకంలో ఒక కవిత.

అలల సవ్వడి లాంటి కవిత.

కిలకిలరావాల కవిత.

కొటానుకోటి భావాలను అక్షరాల వర్షంలో తడిపే కవిత.

ఒకనాడు ఈ కవిత ఆ బొమ్మను చూసింది.

బొమ్మ మనసులోని భావాలను దాని కళ్ళలో చదివింది.

ఆనాటి నుంచి బొమ్మ మాట్లాడుతోంది...

కవిత ద్వారా మాట్లాడుతోంది....

ఇది రెండు కళాహృదయాల కథ..

ఒక విడిపోని, విడదీయలేని స్నేహం కథ...

మనసులోని భావాలకి ఒకరు రూపమిస్తే, ఒకరం ప్రాణం పోస్తాం..

ఇది రెండు అందమైన మనసుల లోకం..

"గీత-రాత " ల లోకం.

చక్కని బొమ్మల, కమ్మని మాటల లోకం..

ఈ లోకానికి శ్రీకారం చుట్టింది... మా స్నేహం..!

Labels

  • priya (14)
  • Sweeya (14)

Blog Archive

  • ▼  2012 (6)
    • ▼  June (5)
      • నైశిక
      • తత్వాన్వేషణ
      • పునర్జన్మకెన్ని పురిటినొప్పులో!!!
      • మబ్బు
      • మౌనం...
    • ►  January (1)
      • దేహాత్మైక్యం
  • ►  2011 (8)
    • ►  November (1)
    • ►  September (2)
    • ►  August (2)
    • ►  May (1)
    • ►  April (1)
    • ►  March (1)

Followers

Follow this blog
http://sweeyapriyam.blogspot.com/. Powered by Blogger.
.
 
Copyright © స్వీయాప్రియం. All rights reserved.
Blogger templates created by Templates Block
Wordpress theme by Uno Design Studio